ప్రధాన రోడ్లపై దుర్గంధం
సిరిసిల్లలో పారిశుధ్యం అస్తవ్యస్తం
మోరీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం
మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల నడిబొడ్డున గల పాతబస్టాండ్ ప్రాంతం. ఇక్కడ చిన్నపాటి జల్లు పడితే చాలు రోడ్డుపై ఇలా మురుగునీరు ప్రవహిస్తుంది. ఇక్కడ రూ.45లక్షలు వెచ్చించి కట్టించిన డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తుతుందని స్థానికులు చెబుతున్నారు.
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో పారిశుధ్య నిర్వహణ పడకేసింది. మోరీల్లోంచి మురుగునీరు రోడ్డుపై పొంగి పొర్లుతోంది. ప్రధాన డ్రెయినేజీలు సిల్టుతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. సిల్టు తీయడంలో బల్దియా నిర్లిప్తత.. పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వెరసి సిరిసిల్ల స్వచ్ఛకీర్తి మసకబారుతోంది. ప్రధాన రోడ్లు, కూడళ్లలో పారిశుధ్య పనులు పడకేయడం అధికారుల పనితనానికి నిదర్శనం.
కనిపించని స్వచ్ఛ బాధ్యత
పట్టణ ప్రధాన వీధుల్లోనే స్వచ్ఛత లోపించింది. పారిశుధ్య నిర్వహణపై బల్దియా బాధ్యతను మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. జాతీయస్థాయిలో వంద శాతం పారిశుధ్య నిర్వహణ అవార్డులు సాధించిన పట్టణంలో కొద్ది రోజులుగా శానిటేషన్ లోపాలు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు పాతబస్టాండు, చంద్రంపేట క్రాసింగ్ వద్ద రోడ్డుపై మురుగునీరు నిలుస్తుంది. డ్రెయినేజీ వ్యవస్థను గాడిలో పెట్టడంలో జాప్యం సిరిసిల్ల స్వచ్ఛకీర్తికి మచ్చగా నిలుస్తోంది. విలీన గ్రామాలు చంద్రంపేట, రగుడు, రాజీవ్‌నగర్, పెద్దబోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్దాపూర్‌లలో డ్రెయినేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఏళ్లుగా పాతబస్టాండు ప్రాంతం వరదలు, మురుగునీటి ప్రవాహంతో కొట్టుమిట్టాడుతోంది. అధికారులు ఎన్సిసార్లు నిర్మాణాలు చేపట్టినా సమస్య తీరడం లేదు. చిన్న వర్షానికే పెద్ద డ్రెయినేజీ నిండి రోడ్డుపైకి పారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు.
– మాగంటి భానుకిరణ్, చిరు వ్యాపారి


