● రాజన్న మహామండపం స్లాబ్
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చకచక సాగుతున్నాయి. మహామండపం నిర్మాణ పనులను హైడ్రాలిక్ కాంక్రిట్ బూమర్‌తో చేపడుతున్నారు. 6,080 చదరపు అడుగుల వైశాల్యంతో మూడు స్లాబ్‌లు రెండు రోజుల్లో పూర్తవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. 100 మీటర్ల ఎత్తు వరకు స్లాబ్‌లు పోసే హైడ్రాలిక్ కాంక్రిట్ బూమర్‌తో పనులు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం యూ షేప్‌లో మూడు మహామండపం స్లాబ్‌లు, తర్వాత మరో స్లాబ్ మొత్తంగా 8వేల పైచిలుకు చదరపు అడుగుల వైశాల్యంతో స్లాబ్ పూర్తవుతుందని వివరించారు. ఆగమశాస్త్రం, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో ఆలయ పనులు చేస్తున్నట్లు తెలిపారు. మహామండపంలో అనిమిటి మండపం, బ్రాహ్మణసత్రం, కోటిలింగాలు, దేవ ధర్మగుండం, తూర్పు–పడమర రాజగోపురాల నిర్మాణాలు ఏక కాలంలో జరుగుతున్నాయని వివరించారు. ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ ఈఈ శాంతయ్య, కాంట్రాక్టర్లు ఉన్నారు.


