పలుకు‘బడి’తో నడుస్తున్న వాహనాలు జిల్లాలో 173 స్కూళ్ల బస్సులు 138 వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలకు రాని బస్సులు 35 ఫిట్‌నెస్ లేకుండా రోడ్డెక్కితే సీజ్ చేస్తాం జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్
సిరిసిల్ల: జిల్లాలోని స్కూల్ బస్సులు ఫిట్‌నెస్‌గా లేవు. ఆదివారంతో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసి సోమవారం నుంచి పునర్ ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో కండీషన్ లేని బస్సుల్లోనే విద్యార్థులను తరలించేందుకు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ర వాణాశాఖ నుంచి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ పొందకుండా.. రోడ్డు ఎక్కితే బస్సులను సీజ్ చేస్తామని రవా ణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. స్కూళ్లు తెరుచుకుంటున్న సందర్భంగా జిల్లాలో బడి బస్సుల భద్రతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అడ్మిషన్లపైనే ఆసక్తి
జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల యజమానులు పిల్లలను బడికి తరలించేందుకు పాత బస్సులను, కాలం చెల్లిన వ్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. యజమానులకు విద్యార్థులను బడిలో చేర్చుకోవడంపై ఉన్న ఆసక్తి బస్సు కండీషన్‌పై ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా 173 స్కూల్ బస్సులు ఉండగా 138 వాహనాలను ఫిట్‌నెస్ పరీక్షలకు తీసుకొచ్చారు. ఇంకా 35 బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలకు దూరంగా ఉన్నాయి. ఆ బస్సులను గుట్టుచప్పుడు కాకుండా పిల్లలను తరలించేందు సిద్ధమైనట్లు ఆరోపణలు న్నాయి. గతంలో ముస్తాబాద్‌లో బడి బస్సు ప్రమాదంలో ఓ బాబు మరణించగా, వేములవాడ పట్టణ సమీపంలోనూ ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. జిల్లాలో బడి బస్ ప్రమాదాలన్నీ కండీషన్ లేని బస్సులతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బస్సులు రిజిస్ట్రేషన్ చేసిన 15 ఏళ్ల వరకే రోడ్డుపై తిప్పాలన్న నిబంధనలు పాటించడం లేదు. పదిహేనేళ్లు దాటిన బస్సులు జిల్లాలో పది వరకు ఉన్నట్లు రవాణాశాఖ అధి కారుల అంచనా. ఇలాంటి ఐదు బస్సులను ఇప్పటికే గుర్తించారు.
ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్
స్కూల్ బస్ ఫిట్‌నెస్ కోసం రవాణాశాఖ సైట్‌లో స్లాట్‌బుకింగ్ చేసుకోవాలి. పెద్ద వాహనాలకు రూ.1,100, చిన్న బస్సులకు(సీట్ల ఆధారంగా) రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పాత వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్ అదనంగా చెల్లించాలి. స్లాట్ బుకింగ్ రోజు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని రవా ణాశాఖ మైదానంలో అధికారులు వాహనం కండీషన్‌ను తనిఖీ చేస్తారు. బస్సులో ప్రథమ చికిత్స బాక్స్, ఫైర్ ఎగ్జాస్టర్, ౖఅత్యవసర ద్వారం, ఫుట్‌బోర్డు, లైట్లు, రేడియం, ఇంజిన్ కండీషన్, బ్రేకులు, హ్యాండ్‌బ్రేక్, హారన్, స్టీరింగ్ బాగుండాలి. వీటిని పరిశీలించిన తరువాతే రవాణాశాఖ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు.
డ్రైవర్‌కు శిక్షణ తప్పనిసరి
జిల్లాలో బడి బస్సులు నడిపే డ్రైవర్లు కనీసం మూడు రోజులపాటు మండెపల్లిలోని టీఐడీఈఎస్ లో శిక్షణ పొందాలి. ఈ శిక్షణ సర్టిఫికెట్ పొందిన డ్రైవర్లనే నియమించుకోవాలనే నిబంధనలు ఉన్నా యి. కానీ కొన్ని విద్యాసంస్థల నిర్వాహకులు ఈ నిబంధనలు పాటించడం లేదు. ఫిట్‌నెస్ సమయంలో సర్టిఫికెట్ ఉన్న డ్రైవర్‌ను చూపుతూ.. ఇతరులను నియమించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


