● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
వేములవాడరూరల్: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి.. అభివృద్ధిలో పార్టీలకతీతంగా కలిసి రా వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. వేములవాడరూరల్ మండలం బొల్లారంలో విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి బొల్లారం–సిరికొండ రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందునే కేంద్రం నుంచి నిధులొస్తున్నాయన్నారు. ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.22వేల కోట్లు తీసుకొచ్చానని తెలిపారు. ఈరోడ్డు విస్తరణకు రూ.23 కోట్లు మంజూరయ్యాయని, ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో సైనిక్‌స్కూల్, నవోదయ స్కూళ్లకు కేంద్రం నుంచి నిధులు వచ్చేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని కోరారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీజేపీ నేతలు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావు, గోపాడి సురేందర్‌రావు, ఎర్రం మహేశ్, అల్లాడి రమేశ్, రాపెల్లి శ్రీధర్ ఉన్నారు.


