వంటింటిపై గుదిబండ | - | Sakshi
Sakshi News home page

వంటింటిపై గుదిబండ

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

గ్యాస్‌ సిలిండర్ల స్వరూపం

మళ్లీ పెరిగిన సిలిండర్‌ ధరలు

మూడు నెలల్లో రూ.89 పెంపు

నెలకు రూ.42.94 లక్షల అదనపు భారం

కట్టెల పొయ్యిపై పేదల వంటలు

నెత్తిన కట్టెల మోపులతో వస్తున్న ఈ మహిళలు లక్ష్మి, మణెమ్మ. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన వీరికి ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)లో ఉచితంగానే సిలిండర్‌ కనెక్షన్‌ ఇచ్చారు. కానీ సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర రూ.1,042.50కు చేరడంతో గ్యాస్‌తో వంటలు చేయలేక.. ఇలా పొయ్యిల కట్టెలను తెచ్చుకుంటున్నారు. సిలిండర్‌ బండ మూలన పడేసి కట్టెల పొయ్యిపైనే వంటలు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కరు.. ఇద్దరు కాదు.. జిల్లా వ్యాప్తంగా వందలాది కుటుంబాలకు చెందిన పేదలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో రీఫిల్లింగ్‌ చేయించకుండా.. స్టౌవ్‌ను పక్కన పెట్టి.. కట్టెల పొయ్యి ఊదుతున్నారు.

సిరిసిల్ల: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుతుండడం మధ్యతరగతి జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత మూడు నెలల్లో ఒక్క సిలిండర్‌పై రూ.89 పెరగడం ఆందోళనను కల్గిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలో దిగువ మధ్యతరగతి వారు కట్టెలపొయ్యి, కరెంట్‌ పొయ్యిలపై వంట చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మూడు నెలల్లో రెండు సార్లు

గత మార్చిలో 14.2 కిలోల సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర రూ.923.50 ఉంది. అదే నెలలో హఠాత్తుగా ఒక్క సిలిండర్‌పై రూ.60 పెంచడంతో రూ.983.50కు చేరింది. తాజాగా మరో రూ.29 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.1,012.50కు చేరింది. సిలిండర్‌ డెలివరీ బాయ్‌ అదనంగా మరో రూ.30 తీసుకుంటుండడంతో అది కాస్త రూ.1042.50కు చేరింది. జిల్లాలో కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు డీజిల్‌తో నడిచే ప్రత్యేక పొయ్యిలను వినియోగిస్తున్నారు.

సబ్సిడీ సిలిండర్లు పక్కదారి

వంట గ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నేరం. అయినా చాలా మంది గృహ అవసరాలకు సిలిండర్లను తెప్పించుకుంటూ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో కమర్షియల్‌ సిలిండర్లు లభించకపోవడంతో సబ్సిడీ సిలిండర్లను గుట్టుగా వినియోగిస్తున్నారు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.3,200 ఉండగా.. సబ్సిడీ సిలిండర్లను వినియోగిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లాలో పౌరసరఫరాల అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి 34 సిలిండర్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా సబ్సిడీ సిలిండర్ల వినియోగం తగ్గడం లేదు. మరోవైపు ఆన్‌లైన్‌లో సిలిండర్లను బుక్‌ చేసుకోడానికి గతంలో మాదిరిగా లేదు. ఒక్కసారి బుక్‌ చేసుకుంటే 45 రోజుల వరకు మళ్లీ సిలిండర్‌ రీఫిల్లింగ్‌ బుక్‌ కావడం లేదు. జిల్లాలో 41,717 మంది గృహ వినియోగదారులు కేవైసీ బయోమెట్రిక్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయలేదు. ఫలితంగా ఈ నెలాఖరిలోగా కేవైసీ ఇవ్వకుంటే సిలిండర్ల రీఫిల్లింగ్‌ నిలిచిపోనుంది. ఉజ్వల యోజన పథకంలోని 3,075 మంది లబ్ధిదారులు కేవైసీ ఇవ్వలేదు.

ఏటా రూ.5.15 కోట్ల భారం

పెరిగిన ధరలతో జిల్లాలోని వినియోగదారులు ఏటా రూ.5.15 భారం మోయాల్సి వస్తుంది. మార్చిలో రూ.60, జూన్‌లో రూ.29 పెంపుతో ఏకంగా ఒక్కో సిలిండర్‌పై రూ.89 భారంగా పడుతుంది. నెలకు రూ.42.94 లక్షలు, ఏడాదికి రూ.5.15 కోట్ల భారమవుతుంది. ఇది సామాన్యులు, మధ్యతరగతి వారికి పెనుభారంగా మారింది. జిల్లాలో 90 శాతం వంటలకు గ్యాస్‌పైనే ఆధారపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement