అధికారంలోకి రాగానే ఆ ఖదరే వేరుగా ఉంటది
‘నా బూత్ నా బాధ్యత’గా పనిచేయాలి
మీరు బూత్‌లో గెలిస్తే.. కేసీఆర్ సీఎం అయినట్లే
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలు పొందిన గులాబీ సైనికులకు మంచి డిజిటల్ గుర్తింపుకార్డులు ఇస్తామని, రేపు అధికారంలోకి రాగానే.. ఆ కార్డుకు ఉండే ఖదరే వేరుగా ఉంటదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో శనివారం బూత్ లెవల్ ఏజెంట్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) పేరుతో ప్రభుత్వం ఓటర్ల జాబితాను జల్లెడ పడుతుందన్నారు. అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. చనిపోయిన వారి పేర్లు, రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక్క చోట తొలగించాలన్నారు. కొత్తగా 18 ఏళ్ల ఓటర్లను నమోదు చేయించాలన్నారు. ఎస్‌ఐఆర్‌పై పవర్ పాయింట్ ప్రదర్శన ఇస్తూ... సమగ్ర వివరాలను వివరించిన కేటీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలను డిజిటల్ విధానంలో ఆన్‌లైన్ చేపట్టాలన్నారు.
కార్యకర్తల సంక్షేమమే మా ప్రాధాన్యం
అధికారం పోయినా కేసీఆర్‌పై మమకారం పోలేదని, ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారంలోకి రాగానే కార్యకర్తల సంక్షేమమే మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఎవరికి వారి ‘నా బూత్ నా బాధ్యత’ అనుకోవాలని, నా బూత్‌లో నేను ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్నా.. కేసీఆర్ సీఎం అయినట్లే అనే ధీమాతో పనిచేయాలన్నారు. ఎవరికి వారు క్షేత్రస్థాయిలో కథానాయకులు అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందన్నారు. జూన్ 25 తరువాత మళ్లీ మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సభ్యత్వాల నమోదు మొక్కుబడిగా కాకుండా డిజిటల్ విధానంలో శాసీ్త్రయంగా ఉండాలన్నారు. ఎస్‌ఐఆర్ ఓటర్ల సవరణలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, పార్టీ నాయకులు కొండూరి రవీందర్‌రావు, తుల ఉమా, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, న్యాలకొండ అరుణ, చీటి నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.


