పునాదులు దాటని గ్రామైఖ్యం | - | Sakshi
Sakshi News home page

పునాదులు దాటని గ్రామైఖ్యం

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

పునాదులు దాటని గ్రామైఖ్యం ● నత్త నడకన గ్రామైఖ్య సంఘాల భవనాలు ● స్థల సమస్య, పెరిగిన ధరలతో సాగని పనులు ● జిల్లాలో 150 గ్రామైఖ్య భవనాలు

● నత్త నడకన గ్రామైఖ్య సంఘాల భవనాలు ● స్థల సమస్య, పెరిగిన ధరలతో సాగని పనులు ● జిల్లాలో 150 గ్రామైఖ్య భవనాలు
జిల్లాలో మహిళాశక్తి స్వరూపం ఇలా..

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మహిళా సంఘాల బలోపేతానికి.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామైఖ్య భవనాల నిర్మాణం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. వేలాది మంది మహిళలు సభ్యులుగా ఉన్న సంఘాల బలోపేతానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు క్షేత్రస్థాయిలో సాగుతున్న పనులకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మహిళల సమావేశానికి అవసరమై న భవనాలు తక్కువగానే ఉన్నాయి. సమావేశాలే కాదు.. ఇతర అవగాహన సదస్సులకు భవనాలు అవసరం. కానీ జిల్లాలో 150 గ్రామైఖ్య సంఘాల భవనాల నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ఇందులో సగం భవనాలు కూడా పనులు మొదలు పెట్టకపోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునాదుల్లోనే..

జిల్లాలో చేపట్టిన మహిళాసంఘాల భవనాల నిర్మాణాలకు అడుగడుగున ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేసింది. అయితే జిల్లాలో చాలా చోట్ల స్థలం సమస్యగా మారింది. ప్రభుత్వ భూములు లేకపోవడం, కొన్ని చోట్ల ఉన్నా అధి కారుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల బేస్‌మెంట్‌, పిల్లర్ల వరకు పనులు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో భవనాలు పూర్తి కాలేదు. మ రోవైపు నిధులు సరిపోవడం లేదని పనులు గుత్తా పట్టుకున్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పెరిగిన స్టీల్‌, ఇసుక, ఇటుక, మేసీ్త్ర బిల్లులతో భవనాలు నిర్మించలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లా అధికారులు మహిళా భవనాలు త్వరగా నిర్మించాలని ఒత్తిడి తీసుకొస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పనులు వేగవంతం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

కుటుంబాలకు పెద్ద దిక్కు సంఘాలే..

జిల్లాలో మహిళా స్వశక్తి సంఘాలు మన సమాజంలో పెనవేసుకుపోయాయి. పొదుపుతో మొదలై.. భారీ రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు వేలల్లో ఉన్నారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా అత్యవసర వేళల్లో ఐకేపీ సంఘాలే అండగా నిలుస్తున్నాయి. ఎరువులు అమ్మడం, ధాన్యం కొనడం, ప్రభుత్వ శాఖలకు బట్టలు కుట్టించడం, పెట్రోల్‌బంకుల నిర్వహణ వంటి వాటివి సంఘాలు చేస్తున్నాయి.

స్వశక్తి మహిళా సంఘాలు : 10,017

గ్రామైఖ్య సంఘాలు : 411

సభ్యులు: 1,09,929

భవనాల నిర్మాణానికి నివేదించాం

ముస్తాబాద్‌ మండలానికి 12 వీవో భవనాలు మంజూరయ్యాయి. సగం వరకు భవనాలు బేస్‌మెంట్‌ వరకు వచ్చాయి. కొన్ని ప్రారంభించలేదు. రానున్న ఆరు నెలల్లో అన్ని భవనాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరుతున్నాం. అధికారులకు నివేదించాం. – రాజనర్సు, ఏపీఎం, ముస్తాబాద్‌

మహిళా భవనం నిర్మించాలి

ముస్తాబాద్‌లో ఇప్పటి వరకు వీవో భవనం పనులు ప్రారంభించలేదు. వందలాది మహిళల కోసం చేపట్టిన భవన నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలి. మహిళల సమావేశాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. అధికారులు వీవో భవన నిర్మాణం పనులు మొదలయ్యేలా చొరవ చూపాలి. – గాండ్ల సుమతి, ముస్తాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement