● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పేదలకు ప్రభుత్వ పథకా లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వ హయాంలోని ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఎస్సారార్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. గ్రామ, మండల సభల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్పోరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే కుడి, ఎడమ కాలువల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరీ మా అగ్రవాల్‌తో కలిసి లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాభాయి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
స్టాళ్లు పరిశీలన
మహిళా సంఘాల ఫుడ్‌స్టాల్, వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆయిల్‌పామ్ ఉత్పత్తులు, సన్న వరి సాగు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం, పోషణ మాసం, బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సన్నరకం వడ్లు, ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను వెల్లడించారు.
మర్రిపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి మినీ ప్రాజెక్టు పనులు వర్షాకాలంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మర్రిపల్లి ప్రాజెక్టును కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి శనివారం పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలను గుర్తించి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలని ఆలోచించారన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా మల్లారం, నాగాయపల్లి, పోచెట్టిపల్లి, కొనాయపల్లి, కాశాయపల్లి, ఎదురుగట్ల, చెక్కపల్లి, అచ్చన్నపేట, వెంకటాంపల్లి, బాలరాజుపల్లి గ్రామాలకు సుమారు 3,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన కొంతమంది రైతులకు ఇంకా ఇవ్వాల్సిన నష్టపరిహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూ చించారు. మర్రిపల్లిలోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌యార్డు, రైతువేదిక, గోదాముల నిర్మాణానికి 12.20 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ అబుబాకర్, మండల పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు.


