నీటి ఇబ్బందులు రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

నీటి ఇబ్బందులు రానీయొద్దు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

● నిత్యం పరిశీలించాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● నిత్యం పరిశీలించాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: రెండు మున్సిపాలిటీలతోపాటు అన్ని గ్రామాల్లోనూ వేసవిలో నీటి ఇబ్బందులు రానీయొద్దని, నిత్యం నీటి సరఫరాను పరిశీలించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నీటి సరఫరాపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ, గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న 45 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా లక్ష్యం మేరకు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలోని ప్రతీ వార్డు, విలీన ప్రాంతాలు, అన్ని మండలాల్లోని చివరి ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నీటిని రోజూ క్లోరినేషన్‌ చేయించాలని, ప్రతీ పది రోజులకోసారి నీటిటాంక్‌లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. అమృత్‌ పథకంలో నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, మండలాలవారీగా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా లక్ష్యం.. ఎంత సరఫరా అవుతుందని కలెక్టర్‌ ఆరా తీశారు. మిషన్‌ భగీరథ ఎస్‌ఈ అమరేందర్‌, మిషన్‌ భగీరథ ఈఈలు అన్వర్‌, సుమలత, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సంపత్‌, డీఆర్డీవో మచ్చ గీత, సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, డీపీవో షరీఫొద్దీన్‌ పాల్గొన్నారు.

రైల్వేలైన్‌ పనులు పూర్తి చేయాలి

జిల్లా పరిధిలో కొనసాగుతున్న కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని క్యాబినెట్‌ సెక్రటరీ(కోఆర్డినేషన్‌) సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ఆదేశించారు. రైల్వేలైన్‌ పనులు, భూసేకరణ, ఇతర అంశాలపై క్యాబినెట్‌ సెక్రటరీ(కోఆర్డినేషన్‌) సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, అటవీ శాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమలశాఖ హనుమంతు, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు శ్రీకాంత్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు కల్పనాదేవి, ఖలీమొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్ధేశిత సమయంలో

అనుమతులు జారీ చేయాలి

జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టీజీఐ–పాస్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ధేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. టీ–ప్రైడ్‌లో 27 వచ్చిన దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని, టీజీ ఐ–పాస్‌లో 49 దరఖాస్తులు రాగా.. 31 అనుమతులు జారీ చేసినట్లు వివరించారు. పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు, జిల్లా రవాణాశాఖ అధికారి వి.లక్ష్మణ్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్న, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, కార్మికశాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement