ప్రైవేట్ మార్కెట్‌లో పేదల బియ్యం దుకాణాల్లోనే ధర కడుతున్న డీలర్లు ప్రజల నుంచి కొనుగోలు చేస్తున్న బ్రోకర్లు అర్ధరాత్రి పూట అక్రమ తరలింపులు పోలీసులు పట్టుకుంటున్నా మారనితీరు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్‌బియ్యం పక్కదారి పడుతున్నాయి. చౌకధరల దుకాణంలోని సన్నబియ్యం ప్రైవేట్‌మార్కెట్‌కు చేరుతున్నాయి. డీలర్లే దుకాణాల్లో ధర కడుతున్నారు. ఇలా పేదలకు అందాల్సిన పౌష్టికాహారం ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పడి అధిక ధరలకు విక్రయాలు జరిగిపోతున్నాయి. చౌకధరల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ ఫోకస్ కథనం.
దుకాణాల్లోనే కట్టబెడుతున్నారు
రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 345 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రతీ నెల 3,700 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే చాలా మంది రేషన్‌కార్డు లబ్ధిదారులు రేషన్‌బియ్యాన్ని తినడం లేదు. దీంతో అత్యధికులు డీలర్లతోనే మాట్లాడుకుని కిలోకు రూ.15 వరకు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్న బియ్యాన్ని డీల ర్లు గ్రామాల్లోని ప్రైవేట్ వ్యక్తులకు కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు.
అర్ధరాత్రి తరలింపు
జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీల్లోని రేషన్‌డీలర్లు సన్నబియ్యాన్ని అత్యధిక మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారు. పొద్దంతా వినియోగదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు అర్ధరాత్రి వరకు దుకాణాల్లోనే ఉంటున్నారు. అక్కడే అర్ధరాత్రి దాటే వరకు స్నేహితులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటున్నారు. డీలర్లు అర్ధరాత్రి పూట గ్రామాల్లో చక్కర్లు కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జనం గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ట్రాలీ ఆటోలలో బియ్యం బస్తాలను తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో రేషన్‌డీలర్లకు కోటా ఎక్కువగా వస్తుండడం.. కొంత ఆర్థికంగా ఉన్న వారు రేషన్‌బియ్యాన్ని తినేందుకు ఇష్టపడకపోవడం వీరికి కలిసి వస్తుంది. ఎంతో కొంత నగదును సదరు లబ్ధిదారులకు ముట్టజెప్పి ఆ బియ్యాన్ని తెల్లవారుజామున ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.
సమయపాలన కరువు
జిల్లాలోని చాలా చౌకధరల దుకాణాల వద్ద కనీసం బోర్డులు కూడా కనిపించడం లేదు. అంతేకాకుండా సమయపాలన లేకుండా దుకాణాలు మూసివేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డీలర్లకు కుదిరినప్పుడు దుకాణాలు తీస్తూ బియ్యం పంపిణీ చేస్తుండడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది.
ఊరికో బ్రోకర్
రేషన్‌దందా పెద్ద మాఫియాగా ఏర్పడింది. ఊరికో బ్రోకర్‌ను ఏర్పాటు చేసుకొని బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం కామారెడ్డి, సిరిసిల్ల పట్టణాల్లోని రైస్‌మిల్లులకు చేరుతున్నాయి. ఇక్కడ ప్రాసెస్ చేసి సరికొత్త బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా పేదల బియ్యం ప్రైవేట్ మార్కెట్‌లో వ్యాపారవస్తువుగా మారుతుంది. పల్లెల్లో వినియోగదారుల నుంచి రేషన్‌బియ్యాన్ని సేకరిస్తున్న బ్రోకర్లు ఇటీవల కామారెడ్డి, సిరిసిల్ల పట్టణాలకు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఊరికి ఐదారుగురు బ్రోకర్లు రేషన్‌బియ్యాన్ని సేకరించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వారం రోజుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న మూడు వాహనాలను, బ్రోకర్లను పోలీసులు పట్టుకున్నారు.


