● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీఎంలు, ఐకేపీ కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, బుక్ కీపర్లకు కలెక్టరేట్‌లో మంగళవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,389, కామన్ రకానికి క్వింటాలుకు రూ.2,369గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. జిల్లాలో ఈ సీజన్‌లో 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేయనున్న 136 కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు వేయించాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. తూకం వేసే యంత్రాలు, తేమ శాతం చూపే యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీబ్యాగ్స్ సరిపడా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఏఈవో ధ్రువీకరించిన తరువాత ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యం పంపించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో మచ్చ గీత, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, పౌర సరఫరాలశాఖ డీఎం నర్సింహారెడ్డి, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు.


