మహిళల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాలల్లో బుధవారం సురక్షిత మాతృత్వ సంరక్షణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ వివిధ శాఖలకు అప్పగించారన్నారు. ప్రజలకు ఇప్పటివరకు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేయడం, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై ఒక నివేదిక సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా అటువంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హెచ్చరించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ గర్భిణుల వివరాలు ఆస్పత్రుల్లో నమోదు కావాలని, వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని సూచించారు. పిల్లలకు తల్లిపాలు ఇచ్చేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలోని 552 మంది అంగన్‌వాడీ కేంద్రాల బాధ్యులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాతృ సంరక్షణపై పట్టణంలో డీఎంహెచ్‌వో రజిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.


