సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు 40 శాతం పూర్తి చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా హౌజింగ్ పీడీ వెంకటమాధవరావు తెలిపారు. ఈమేరకు బుధవారం ఒక పత్రిక ప్రకటన విడుదలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.లబ్దిదారులకు ప్రజా ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోంది. ఇండ్లు పూర్తి చేసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఇప్పటిదాకా రూ. 161 కోట్లకుపైగా ఆర్థిక సహాయం జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా నిలిచిందన్నారు. లబ్దిదారులు పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాల వేడుకలు చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు 3,570 స్లాబ్ లెవెల్‌లో ఉండగా, 1,419 (దాదాపు 40 శాతం) పూర్తి అయ్యాయని, ఇంకా 2,151 ఇళ్లు తుది దశలో ఉన్నాయని వివరించారు.
పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యం
సిరిసిల్లటౌన్: పేద వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీపీఐ ఆవిర్భావం నుంచి అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఐ మాస్ క్యాంపెయిన్‌లో భాగంగా బుధవారం సిరిసిల్లలో గడపగడప ప్రచారం చేపట్టారు. ప్రజానిధిని సేకరిస్తూ మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో సీపీఐ ముందుంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి నిధుల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఆర్‌డీవోగా ఉప్పుల శ్రీధర్
సిరిసిల్ల అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో)గా ఉప్పుల శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ డీఆర్డీవోగా వ్యవహరిస్తున్న శ్రీధర్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయగా, సిరిసిల్ల డీఆర్డీవో గీతను కరీంనగర్‌కు బదిలీ చేశారు.
‘కేసీఆర్ కప్’ను విజయవంతం చేయాలి
తంగళ్లపల్లి: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరి ట జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. బుధవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఈనెల 10నుంచి 17వరకు టోర్నమెంట్ నిర్వహించనున్న క్రీడామైదానాన్ని పరిశీలించారు. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గజాబింకర్ రాజన్న, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


