● జీపీల బకాయి విద్యుత్ బిల్లులు రూ.400కోట్లు ● నూతన పాలకవర్గాలకు పెనుభారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇటీవల కొలువుదీరిన గ్రామపంచాయతీల నూతన పాలకవర్గాలకు విద్యుత్ బిల్లుల బకాయిలు కలవరపెడుతున్నాయి. కొన్నేళ్లుగా విద్యుత్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో పెండింగ్‌లోనే ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ‘సెస్’ సంస్థ(ప్రస్తుత ఎన్పీడీసీఎల్)కు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు రూ.400 కోట్లు బకాయిలు పడ్డాయి. ఈ బిల్లులు చెల్లించడం నూతన పాలకవర్గాలకు తలకుమించిన భారంగా మారింది. అదే విధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కలుపుకొని రూ.701 కోట్లకు పైగా బకాయిలు పడ్డట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. బకాయిలపై ఎన్పీడీసీఎల్ ప్రత్యేక పోకస్‌తో ముందుకుపోనున్నట్లు సీఎండీ వరుణ్‌రెడ్డి ప్రకటించారు. దీంతో పంచాయతీ పాలకవర్గాల్లో బిల్లులు ఎలా చెల్లించేదని ఆందోళన మొదలైంది.
నిధులు లేక నీరసం
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా.. రూ.400 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు పడ్డాయి. జీపీలలో నిధులు లేకపోవడం, వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం పంచాయతీల్లోని మల్టీపర్పస్ వర్కర్లకు, చెత్తసేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ నిర్వహణకే సరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులకు నిధులు ఉండడం లేదు.
బకాయిల భారం
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాలకు సిరిసిల్ల సెస్ సంస్థ విద్యుత్ సేవలు అందించింది. సెస్ సంస్థ ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసింది. ఇలా సేవలు అందించినందుకు కొంత మొత్తంలో లాభాలు సైతం తీసుకుంది. అయితే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. గ్రామాల్లోని వీధిదీపాలు, నీటి సరఫరా మోటార్ల బిల్లులు ప్రతీ నెల లక్షల్లోనే వస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.701 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయి.
వివరాలు ఇలా..
గ్రామపంచాయతీలు : 260
బకాయి బిల్లులు : రూ.400 కోట్లు
మున్సిపాలిటీలు : 02
విద్యుత్ బకాయిలు : రూ.115 కోట్లు
జిల్లా వ్యాప్తంగా సెస్‌కు బకాయిలు : రూ.701 కోట్లు


