క్రీడా సం‘గ్రామం’
● 17 నుంచి రెండో విడత సీఎంకప్
● గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు
● 44 అంశాల్లో ఆటల పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి, వారికి శిక్షణ, ప్రోత్సాహం అందించడం ఈ చీఫ్ మినిస్టర్స్ కప్ ముఖ్యఉద్దేశం.
సీఎం కప్ షెడ్యూల్
ఈ నెల 8 నుంచి 17 వరకు టార్చ్ ర్యాలీ, 17 నుంచి 22 వరకు గ్రామస్థాయి పోటీలు, 28 నుంచి 31 వరకు మండల, మున్సిపాలిటీ, జోనల్, కార్పొరేషన్‌స్థాయి పోటీలు, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు అసెంబ్లీ నియోజకవర్గస్థాయి పోటీలు, 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి పోటీలు, 20 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి పోటీలు సబ్ జూనియర్స్ (బాలబాలికలు), జూనియర్స్ (బాలబాలికలు), సీనియర్స్ (పురుషుల, మహిళలు), పారా గేమ్స్, రిక్రీయేషన్స్ గేమ్స్ (చిన్న పిల్లలు) విభాగాల్లో జరుగుతాయి. చీఫ్ మినిస్టర్స్ కప్– 2024 రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి వ్యక్తిగత విభాగంలో మొదటి స్థానానికి రూ. 20వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10వేలు, టీం విభాగంలో మొదటి స్థానానికి రూ.లక్ష, ద్వితీయ రూ. 75వేలు, తృతీయ స్థానానికి రూ.50 వేలు అందజేస్తారు.
వివిధ క్రీడాంశాల్లో పోటీలు
మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్‌తక్రా, చెస్, బేస్‌బాల్, నెట్‌బాల్, కిక్‌బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్– కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్‌బాల్, సెయిలింగ్, బాల్‌బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియేషనల్ క్రీడలు జరుగుతాయి.
యోగా పోటీలు కేటాయించాలి
యోగా క్రీడలో కరీంనగర్ జిల్లాకు అరుదైన ఘనత ఉందని, కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి సిద్ధారెడ్డి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు.
సీఎం కప్
లోగో
క్రీడా సం‘గ్రామం’


