జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన టీయూడబ్ల్యూజే
కరీంనగర్: హైదరాబాద్‌లోని ఎన్టీవీ కార్యాలయంపై మంగళవారం ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా పోలీసులు దాడి చేసి జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే నాయకులు నగునూరి శేఖర్, ఎలగందుల రవీందర్, గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, గాజుల వెంకటేశ్ ఒక ప్రకటనలో ఖండించారు. ఇలాంటి చర్యలు మీడియా రంగంపై గొడ్డలి పెట్టు లాంటివని, వెంటనే ప్రభుత్వం అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
ధర్మపురి: అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రాజేందర్ (59) బీర్‌పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. మూడు రోజుల క్రితం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేందర్‌కు భార్య, కొడుకు, కూతురున్నారు. ఇటీవల కూతురు వివాహం చేశాడు. రాజేందర్ మృతిపై ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.
కథలాపూర్(వేములవాడ): మండలంలోని దూలూర్ శివారులో బుధవారం కోడిపందేల ఆట జోరుగా సాగింది. ఇందులో భాగంగా వేలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందాలు నిర్వహిస్తున్నారని తెలిసి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 50 మంది వరకు అక్కడకు చేరుకున్నట్లు తెలిసింది. మొదటగా ఆటకు రూ.5వేల చొప్పున ప్రారంభమై.. ఉత్కంఠగా మారి రూ.50వేల వరకు డబ్బులు పెట్టినట్లు సమాచారం. ఆటలో డబ్బులు పోగొట్టుకున్నవారు నిరాశతో వెనుదిరగారు. డబ్బులు వచ్చిన వారు సంతోషంలో మునిగిపోయారు. కోడిపందాలు యథేచ్ఛగా జరిగినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన టీయూడబ్ల్యూజే


