పుష్కరకాలంగా ఇదే ‘దారి’ద్య్రం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో ఉన్న ‘అమ్మా అనాథ వృద్ధాశ్రమం’లో విషాదకర పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ రావడానికి సరైన దారి లేక వృద్ధులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఆశ్రమంలో ఉంటున్న యాంసాని సత్యలక్ష్మి (78) శనివారం కాలుజారి పడడంతో ఆమె నడుము విరిగింది. అలాగే గోగుల లక్ష్మి (65) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆశ్రమ నిర్వాహకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాగా, ఆశ్రమానికి వెళ్లే దారి బురదమయంగా ఉండటంతో వాహనం లోపలికి రాలేకపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది సుమారు గంట సేపు శ్రమించి, బాధితులను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి చాలా దూరం మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. 13 ఏళ్లుగా ఆశ్రమానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరీ దారుణంగా ఉంటుందని, అత్యవసర వైద్యం అందక వృద్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వృద్ధాశ్రమానికి సీసీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నారు.


