వీబీ జీ రామ్ జీ చట్టం రద్దు చేయాలి
● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్ల అర్బన్: వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత ఇరువై ఏళ్లుగా ఉపాధిహామీ పథకం దేశంలోని పేదలకు సొంతూరిలోనే ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వందశాతం కేంద్ర నిధులతో అమలవుతున్న ఉపాధిహామీ ప థకం పేరు మార్చడంతోపాటు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించేలా నిబంధనలు తేవడం దారుణమన్నారు. ఉపాధిహామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 8 నుంచి వివిధ కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాలు మడుపు శ్రీదేవి పాల్గొన్నారు.


