ఉంటుందా.. పోతుందా !
ఇదీ జిల్లా స్వరూపం
రాజన్న సిరిసిల్ల
● జిల్లా పునర్ వ్యవస్థీకరణపై రాజకీయ చర్చలు ● అసెంబ్లీ వేదికగా రెవెన్యూశాఖ మంత్రి ‘పొంగులేటి’ ప్రసంగం ● జిల్లాల సంఖ్యను కుదిస్తామని వ్యాఖ్యలు ● ఇప్పటికే పడిపోయిన రియల్ ఎస్టేట్ ● మంత్రి మాటలతో మరింత కుదేలు
I
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
‘రాష్ట్రంలో సంఖ్య కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. ఒక్క రెవెన్యూ డివిజన్‌లోని మండలాన్ని మరో జిల్లాలో, ఒక్క నియోజకవర్గంలోని మండలాలను మూడు నాలుగు జిల్లాల్లో కలుపుతూ.. ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.’ ఈ ప్రకటనతో జిల్లాలోని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదిస్తారని సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో జిల్లా ఉంటుందా.. పోతుందా ? అనే చర్చ సాగుతోంది.
సిరిసిల్ల: అది 2016.. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రోజులు. అదే సమయంలో జిల్లా ఏర్పాటు ఉద్యమం మొదలైంది. వాస్తవానికి సిరిసిల్ల డివిజన్‌లో తొమ్మిది మండలాలు ఉండగా... గంభీ రావుపేటను కామారెడ్డి, ముస్తాబాద్, ఇ ల్లంతకుంటలను సిద్దిపేట జిల్లాలో కలి పేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈక్రమంలో సిరిసిల్ల డివిజన్‌ను విడదీయొద్దని, కొత్తగాా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. స్థానికులు జేఏసీగా ఏర్పాటయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమం మాదిరిగానే జిల్లా సాధన ఉద్యమం ఊరూరా సాగింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో రిలేదీక్షలు రోజుల తరబడి కొనసాగాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది.
● రేవంత్‌రెడ్డి సైతం మద్దతు
జిల్లా సాధన ఉద్యమానికి మద్దతుగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డి సైతం సిరిసిల్ల అంబేడ్కర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు అన్ని పార్టీల నాయకులు జిల్లా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. చాలా మంది ఉద్యమకారులు జైలుపాలయ్యారు.
● 2016 అక్టోబరు 11న సాకారం
రాజన్నసిరిసిల్ల జిల్లా 2016 అక్టోబరు 11న ఏర్పాటైంది. అనంతరం కలెక్టరేట్, జిల్లా పోలీస్ ఆఫీస్(డీపీవో), నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు మంజూరై భవనాలు పూర్తయ్యాయి. వ్యవసాయకాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, అపెరల్ పార్క్ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుకాగా.. సొంత భవనాలకు నోచుకోలేదు. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణంలో ఉంది. రాజన్నసిరిసిల్ల కంటే రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు అన్ని కోణాల్లోనూ చిన్నవిగా ఉన్నాయి.
● రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ ఢమాల్
నిజానికి రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ పరుగులు తీయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకాగానే కుప్పకూలింది. టెంపుల్‌సిటీ వేములవాడ, కార్మిక క్షేత్రం సిరిసిల్లతోపాటు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, గంభీరావుపేట, బోయినపల్లి, రుద్రంగి మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగడం లేదు. తాజాగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనతో జిల్లా ఉంటుందా.. పోతుందా.. అనే చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కొనసాగింపుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.
గ్రామపంచాయతీలు : 260
రెవెన్యూ గ్రామాలు : 171
మండలాలు : 13
మున్సిపాలిటీలు : సిరిసిల్ల, వేములవాడ
జనాభా : 5,52,037
పురుషులు: 2,74,109
మహిళలు: 2,77,928
భౌగోళిక విస్తీర్ణం : 1,908 చదరపు కిలోమీటర్లు
భూ విస్తీర్ణం : 4,77,125 ఎకరాలు
అక్షరాస్యత శాతం: 66.27
అటవీ విస్తీర్ణం : 379.14 చదరపు కిలోమీటర్లు
ప్రత్యేకత : వేములవాడ రాజన్న ఆలయం, వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల
ఆదాయం: వ్యవసాయం, వలసలు, వస్త్రోత్పత్తి
ఉంటుందా.. పోతుందా !


