కుమారులు పోషించడం లేదు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కని, పెంచి, పెద్దచేసిన తర్వాత ఆస్తులు తీసుకున్న కుమారులు తమ పోషణ విస్మరించారని వృద్ధ దంపతులు కలెక్టర్, ఎస్పీలకు విన్నవించుకున్నారు. బాధితుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన అందె పోచయ్య(79), అందె లక్ష్మి(69) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారి పెళ్లిళ్లు చేసిన తర్వాత కొడుకులు చెరో రెండెకరాలను బలవంతంగా రిజిస్ట్రే షన్ చేసుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. భూమి తీసుకున్నా.. పదేళ్లుగా సాగు చేయడంలేదు. దీంతో అది బీడుగా మారింది. తమ బతుకుదెరువు కోసం ఇటీవల ఆభూమిని వృద్ధ దంపతులు దున్నించేందుకు యత్నించగా.. పెద్దకొడుకు అడ్డుకున్నాడు. రూ.30వేల వరకు ఖర్చుచేసి వరి నారు పోస్తే పంట వేసుకోనివ్వడం లేదు. అందులో పంటలు వేసుకునే అవకాశం కల్పించేందుకు, ఇద్దరి కొడుకులను పిలిపించి మాట్లాడి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.
పంచాయతీ అధికారులకు ప్రత్యేక శిక్షణ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కొత్తగా ఎన్నికై న సర్పంచులకు పంచాయతీ రాజ్ శాఖ చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో సర్పంచులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాల నుంచి పలువురు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఎంచుకుని వారిని హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించింది. ఈ శిక్షణకు సిరిసిల్ల జిల్లా నుం,చి డీఎల్‌పీవో వీరభద్రయ్య, ముస్తాబాద్ ఎంపీడీవో పుట్టి లచ్చాలు, బోయినపల్లి ఎంపీడీవో జయశీల, రుద్రంగి ఎంపీడీవో నటరాజ్, చందుర్తి ఎంపీవో ప్రదీప్, వేములవాడ ఎంపీవో రమేశ్, కోనరావుపేట ఏపీవో శ్రీనివాస్, తంగళ్లపల్లి టీఏ లక్ష్మణ్ గౌడ్ తరలివెళ్లారు. వీరు ఈనెల 9వరకు ప్రత్యేక శిక్షణ తీసుకుని అనంతరం జిల్లాలో సర్పంచులకు శిక్షణ తరగతులు చేపట్టనున్నారు.
కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు
కుమారులు పోషించడం లేదు


