యువకుడిపై కత్తిపోట్లు
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామశివారులో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శశిప్రీతమ్‌పై అదే గ్రామానికి చెందిన శ్రీధర్ వివాహేతర సంబంధం అనుమానంతో కత్తితో దాడి చేసినట్లు వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న శ్రీధర్ భార్య కరీంనగర్‌లోని ఓ మార్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. శశిప్రీతమ్ కరీంనగర్‌లోని కారు షోరూంలో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం శశిప్రీతమ్ భార్య వచ్చి శ్రీధర్ భార్యతో గొడవ పడ్డారు. ఈవిషయం తెలుసుకున్న శ్రీధర్ మాట్లాడుకుందామని శశిప్రీతమ్‌ను రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని కొదురుపాక మీదుగా వస్తుండగా దేశాయిపల్లి గ్రామశివారులో శ్రీధర్ అనే వ్యక్తి శశిప్రీతమ్‌ను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శశిప్రీతమ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని రూరల్ సీఐ శ్రీనివాస్ సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
సిరిసిల్ల: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రత చర్యలు పాటించాలని సిరిసిల్ల సహాయ రవాణాశాఖ అధికారి పృథ్వీరాజ్ వర్మ అన్నారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేట బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‌పై పాఠశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పెయింటింగ్‌పై ఆచరణాత్మక ప్రదర్శన నిర్వహించి వివరించారు. జిల్లా రవాణా శాఖ సిబ్బంది రమ్య, సౌమ్యరాణి, ప్రశాంత్, ఎల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్‌పై కేసు
సిరిసిల్ల: పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఇందిరానగర్‌లో రేషన్ డీలర్‌పై పౌరసరఫరాల అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. రేషన్ డీలర్ ఆకునూరి అశోక్ షాపును పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తనిఖీ చేశారు. సన్నబియ్యం 92.51 క్వింటాళ్లు, దొడ్డు బియ్యం 62.55 క్వింటాళ్లు, చక్కెర 87 కిలోల వ్యత్యాసం ఉంది. రేషన్ షాపులో ఉన్న నిల్వ సన్నం బియ్యం 31.50 క్వింటాళ్లు, చక్కెర 35 కిలోలు మాత్రమే ఉంది. స్టాకులో వ్యత్యాసం గురించి వివరాలు కోరగా సరైన సమాధానం రాలేదు. దీంతో రేషన్ షాపులోని సరుకులు సీజ్ చేసి మరో రేషన్ డీలర్ విజయకు అప్పగించారు. అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరా అధికారులు పేర్కొన్నారు.
యువకుడిపై కత్తిపోట్లు


