● అనుమతులు ఒక చోట.. నిర్మాణాలు మరో చోట ● పట్టించుకోని అ
వేములవాడరూరల్: వేములవాడ మున్సిపాల్టీలో విలీనమైన శాత్రాజుపల్లి, కోనాయపల్లి, అయ్యోరుపల్లి, తిప్పాపూర్, నాంపల్లి తదితర గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండా అనుమతి ఒకచోట, నిర్మాణం మరోచోట చేపడుతున్నారని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత ఇళ్ల యజమానుల వద్ద ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జోరుగా నిర్మాణాలు..
మున్సిపల్ పాలకవర్గం ముగిసి ఏడాది గడిచింది. పాలకవర్గం లేకపోవడంతో కొంత మంది అధికారులకు ముడుపులు అప్పగించి ఇష్టారీతిన ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని కొంతమంది యజమానులు నిబంధనలు పాటించకుండా నూతన నిర్మాణాలు జోరుగా చేపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మాజీ కౌన్సిలర్లదే పెత్తనం
వేములవాడ మున్సిపాల్టీలో 5 గ్రామాలు విలీనం కాగా వార్డుల సంఖ్య 28కి చేరింది. కొంతమంది మాజీ కౌన్సిలర్ల ప్రమేయంతోనే అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అనుమతులకు ఇబ్బందిగా ఉంటుందని ఇంటి యజమానులు, పాలకులు, అధికారులకు అడిగినంత అప్పజెప్పి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి.


