మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేములవాడ: మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీకాలనీ 4, 5వ వార్డులలో రూ.45లక్షలతో సీసీరోడ్డు, సైడ్ డ్రెయినేజీ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరై, పలు కులసంఘం భవన నిర్మాణాలకు మంజూరుపత్రాలు అందజేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణం, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని సుమారు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో గతేడాది రూ.800 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా వేములవాడ పరిధిలో సుమారు 45 కుల సంఘాలకు నిధుల మంజూరు చేసినట్లు తెలిపారు. మూలవాగుపై మూడో బ్రిడ్జి, మార్కెట్‌యార్డు జంక్షన్ నుంచి తెలంగాణచౌక్ వరకు రోడ్డు పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రతీ వార్డుకు రూ.10లక్షల చొప్పున మంజూరు చేసి పనులు చేస్తున్నట్లు వివరించారు. జమ్మిగద్దె వరకు సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మికాలనీలో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.


