గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం మాట్లాడుతూ అదే సమయంలో 2026–27 బడ్జెట్‌లో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించి, సహాయం అందించేలా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రవాసి ప్రజావాణి ఫిర్యాదు కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దాదాపు 10 లక్షల మంది గల్ఫ్ కార్మికుల పిల్లలు ఉన్నారని.. రానున్న విద్యాసంవత్సరానికి గురుకులాల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటా కేంద్రం నిర్వహించినట్లు రాష్ట్రంలో ‘ప్రవాసి తెలంగాణ దివస్’ నిర్వహించాలని కోరారు. ఈ దిశగా టాంకామ్, న్యాక్ సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రతీ నెల సుమారు 100 ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న మాతాశిశు సంరక్షణ(ఎంసీహెచ్)ను 50 పడకలకు పెంచాలని కోరారు.


