బీఆర్‌ఎస్ హయాంలో అక్రమ కేసులు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులపై దాడులు చేయడమే కాకుండా, ఎల్లారెడ్డిపేట పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. గతంలో పోలీసులు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయగా సోమవారం సిరిసిల్ల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. అప్పట్లో ఎల్లారెడ్డిపేట ఠాణాలోకి బీఆర్‌ఎస్ నాయకులు చొచ్చుకొని వచ్చి తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. తిరిగి తమ పార్టీ కార్యకర్తలపైనే కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరైన వారిలో పార్టీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు బోనాల సాయి, మారవేణి రంజిత్‌కుమార్, మద్దుల బుగ్గారెడ్డి, దాసరి గణేశ్, కోనేటి సాయిలు తదితరులున్నారు.


