
అర్హులకు రేషన్‌కార్డులు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అర్హులకు రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండలంలోని బద్దెనపల్లి ఎస్‌ఎస్ గార్డెన్స్‌లో బుధవారం నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కెకె.మహేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో నూతనంగా 1,397 కొత్త రేషన్‌కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,224 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. నూతన రేషన్‌కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని స్పష్టం చేశారు. అంతకముందు చీర్లవంచలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. చీర్లవంచ జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలతోపాటు మండల కేంద్రంలోని ట్రైబల్‌డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రెండు పశువుల చొప్పున 14 మందికి పంపిణీ చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఏఎంసీ వైస్‌చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ జె.టోని తదితరులు పాల్గొన్నారు.