దారులన్నీ కొండగట్టుకే..
జగిత్యాల: జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ తమ ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులోగల శ్రీఆంజనేయస్వామి ఆలయం ముస్తాబైంది. మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం లైటింగ్స్ సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులను అధిక సంఖ్యలో నియమించారు. జయంతి సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షాపరులు మాలవిరమణ చేసి అంజన్నకు ముడుపు కట్టనున్నారు.
రెండు లక్షల మంది అంచనా..
అంజన్న సన్నిధైన కొండమీదకు కాలినడకన, వాహనాల్లో అనేక ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వరకు భక్తులందరూ కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో అర్ధరాత్రి వరకు సేదతీరి క్యూలైన్లలో నిలబడి మాల విరమణ చేయనున్నారు. జై హనుమాన్, జై శ్రీరాం అంటూ కొండ ప్రాంగణమంతా మారుమోగనుంది.
భక్తుల దర్శనం ఇలా..
● కొండ దిగువ నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, దారి వెంట భక్తులకు ఆటోల ద్వారా నీరు అందించనున్నారు. ●
● ఘాట్‌రోడ్ మీదుగా వాహనాలపై.. మెట్లదారిలో కాలినడకన గుట్టపైకి చేరుకోవాలి.
● నాచుపల్లి జేఎన్టీయూ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు.
● కొండపైకి చేరుకున్నాక పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడి కల్యాణకట్టలో మాల విరమణ చేసుకోవాలి.
● నూతన కోనేరు పక్కనున్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించాలి.
● నూతన కోనేరులో స్నానాలు ఆచరించాలి.
● ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి.
● ఆలయం వెనక వైపు నుంచి తిరుగు పయనం కావాలి.
కాషాయమయమైన అంజన్న సన్నిధి
నేటి నుంచి చిన్న జయంతి
తరలిరానున్న రెండు లక్షల మంది
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ
అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా


