రైతుల సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రుద్రంగి(వేములవాడ): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో డీసీఎంఎస్, పాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సన్నబియ్యాన్ని బీజేపీ ఇస్తే ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పంపినీ చేయడం లేదని ప్రశ్నించారు. రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం పాల్గొన్నారు.


