భ్రూణహత్యలపై కొనసాగుతున్న విచారణ
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలంలో జరిగిన భ్రూణహత్యలపై మంగళవారం డీఎంహెచ్‌వో రజిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మండలంలోని మూడపల్లిలోని ఆర్‌ఎఎంపీ వైద్యుడిని విచారించారు. కాగా వారి దృష్టికొచ్చిన మరికొన్ని సంఘటనలపై విచారణ కొనసాగినట్లు తెలిసింది. కాగా విషయం బయటకు చెప్పొద్దని బాధితుడిని మూడపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో జిల్లా వైద్య సిబ్బంది సంపత్, చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వేదాచారి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదులపై దాడులు అరికట్టాలి
సిరిసిల్లకల్చరల్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు కోరారు. హైదరాబాద్‌లో ముజీతాబ్ అలీ అనే న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం స్థానిక న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణచట్టం తెస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు కోడి లక్ష్మణ్, అనిల్‌కుమార్, ప్రభాకర్, శశాంక్ పాల్గొన్నారు.
15న వాటర్‌షెడ్ యాత్ర
సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీ రావుపేట మండలా ల్లో ఈనెల 15న వాట ర్‌షెడ్ యాత్ర నిర్వహిస్తున్నామని డీఆర్‌డీవో శేషాద్రి తెలిపారు. ప్రధానమంత్రి కృషి సమాన్ యోజన–2.0లో భాగంగా వాటర్‌షెడ్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 15న ఉదయం ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా, మధ్యాహ్నం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో వాటర్‌షెడ్ యాత్ర ఉంటుందని వివరించారు.
‘బీడీకార్మికులకు రూ.4వేల పెన్షన్ ఇవ్వాలి’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ కోరారు. పద్మనగర్‌లో మంగళవారం నిరసన తెలిపి మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4వేలు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలలో 26 రోజులు నడవాల్సిన బీడీ పరిశ్రమ 10 రోజులు మాత్రమే నడుస్తోందన్నారు. కొక్కుల ప్రసాద్, నాంపల్లి, రామస్వామి, కొమురయ్య, జిందం రమేశ్, మల్లేశం, బీడీ కార్మికులు పాల్గొన్నారు.
సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించి ఇటీవల కలెక్టరేట్‌కు బదిలీపై వెళ్లిన నాగరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంభీరావుపేటలో వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
భ్రూణహత్యలపై కొనసాగుతున్న విచారణ


