దుఃఖంలోనూ భర్తకు సెల్యూట్‌ చేసిన భార్య సౌజన్య

- - Sakshi

బోయినపల్లి(చొప్పదండి): జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన అనిల్‌ అంతిమయాత్ర కుటుంబ సభ్యుల రోదనలు, బంధువులు, ప్రజాప్రతినిధుల ఆశ్రునయనాల మధ్య ముగిసింది. శనివారం ఉదయం అనిల్‌ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన మల్కాపూర్‌లోని ఇంటికి చేరడంతో మండలవ్యాప్తంగా జనం భారీగా తరలివచ్చారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి గంగాధరకు చేరుకుంది. అక్కడ పలువురు యువకులు జాతీయ జెండాలతో స్వాగతం పలికి ర్యాలీగా మల్కాపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్మీ అధికారులు సైనికలాంఛనాలతో గౌరవ వందనం చేశారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభించారు. అనిల్‌ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ సిబ్బంది గౌరవ వందనం చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. అనిల్‌ పెద్ద కుమారుడు అయాన్‌ తండ్రి చితికి నిప్పంటించాడు.

నిన్ను విడిచి ఎలా ఉండాలే బావా..
అనిల్‌ భార్య సౌజన్య రెండురోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉంది. ‘బావా నిన్ను విడిచి నేనెలా ఉండాలే బావా.. పిల్లలను ఎట్ల సాదాలే బావా.. అని రోదించడం చూసేవారిని కంటతడి పెట్టించింది. ‘నన్ను పోలీస్‌గా చూడాలని అంటివి. నీ మాటతోనే ఎస్సై పరీక్ష రాసిన బావ..’ రెండు నెలలైతే దగ్గరికి బదిలీ చేయించుకుంట అంటివి.. అంతలోనే ఘోరం జరిగిందా బావా..’ అంటూ భర్త ఫొటో ఉన్న ఫ్లెక్సీ వద్ద విలపించింది. అనిల్‌ తల్లి లక్ష్మి, అనారోగ్యంతో ఉన్న తండ్రి మల్లయ్య ఏడుస్తుండడాన్ని ఆపడం ఎవరితరమూ కాలేదు. కుమారులు అయాన్‌, అరయ్‌ సైతం తండ్రి శవపేటిక వద్ద విలపించారు.

అమరుడైన భర్తకు భార్య సెల్యూట్‌
అనిల్‌ భౌతికకాయాన్ని చితిపై పెట్టిన అనంతరం సైనికులు గౌరవ వందనం చేశారు. సైనిక గీతం ఆలపించిన సమయంలో అంతులేని దుఃఖంలోనూ సౌజన్య భర్త భౌతికకాయానికి సెల్యూట్‌ చేయడం అక్కడున్నవారిని మరింత కంటతడి పెట్టించింది. తండ్రి చితికి ఆయన పెద్ద కుమారుడు అయాన్‌ నిప్పు పెట్టాడు. అనిల్‌ సైనిక యూనిఫాంను ఆర్మీ అధికారులు సౌజన్యకు అందించారు.

హాజరైన మంత్రి గంగుల, ఎంపీ సంజయ్‌
అనిల్‌కు మంత్రి గంగుల కమలాకర్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఏఎస్పీ తదితరులు నివాళులు అర్పించారు. అంత్యక్రియలు ముగిసేవరకూ అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ అనిల్‌ పాడె మోశారు. అంతిమయాత్రలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, వేములవాడ ఆర్డీఓ పవన్‌కుమార్‌, రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్‌రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జెడ్పీటీసీలు కత్తెరపాక ఉమ, నాగం కుమార్‌, సెస్‌ డైరెక్టర్‌ కొట్టెపెల్లి సుధాకర్‌, సర్పంచు కోరెపు నరేశ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, సెస్‌ మాజీ చైర్మన్‌ అల్లాడి రమేశ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం, ఎంపీడీఓ నల్లా రాజేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, బోయినపల్లి ఎస్సై మహేందర్‌ బందోబస్తు నిర్వహించారు.

అనిల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం
అనిల్‌ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. అనిల్‌ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆయన కుటుంబాన్ని పరామర్శించామని, యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

Read latest Rajanna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top