
కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్
సిరిసిల్ల: గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన ఉండాలని జిల్లా ఉపవైద్యాధికారి రజిత కోరారు. కలెక్టరేట్‌లో గురువారం సుందరయ్యనగర్, తంగళ్లపల్లి ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి కార్డియో పల్మనరీ రిసిటేషన్(సీపీఆర్)పై శిక్షణ ఇచ్చారు. డాక్టర్ రజిత మాట్లాడుతూ గుండెపోటు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలన్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్నాయని, ఆ జాగ్రత్తలు తెలియక ప్రాణాలు పోతున్నాయన్నారు. విలువైన ప్రాణాలను కాపాడడమే సీపీఆర్ లక్ష్యమన్నారు. శిక్షణలో డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వేణుమాధవ్, డీఈఎంవో బాలయ్య, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
నేడు జాతీయ
సాహిత్య సదస్సు
సిరిసిల్లకల్చరల్: రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ, మానేరు రచయితల సంఘం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త నిర్వహణలో కళాశాలలో శుక్రవారం జాతీయస్థాయి సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో కళాశాల పూర్వ విద్యార్థి, కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ సాహిత్యంపై సమాలోచన చేయనున్నట్లు తెలిపారు. కవులు, సాహితీవేత్తలు భారీగా హాజరై సదస్సును జయప్రదం చేయాలని కోరారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యా యత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్‌కాలనీలో నివసించే ఓ వివాహిత కుటుంబ కలహాలతో గురువారం పురుగుల మందు తాగింది. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు. కేసీఆర్‌కాలనీలో నివసించే భారతం జ్యోతి(32)కి భర్త వెంకటేశ్‌తో కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. ఆర్థికంగా సమస్యలు, భార్యతో తరచూ గొడవలు పడుతుండగా మనస్థాపానికి గురైన జ్యోతి గురువారం పురుగులమందు తాగింది. ప్రస్తుతం కరీంనగర్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఘనంగా సుదర్శన చండీ చక్రయాగం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్ శివారు ఓమౌజాయ ప్రజ్ఞ క్షేత్రంలో గురువారం శ్రీసుదర్శన చండీ చక్రయాగం నిర్వహించారు. సద్గురు సత్యభగవాన్ ప్రభుజీ ఆధ్వర్యంలో సుదర్శన యజ్ఞం నిర్వహించారు. ఈనెల 22 నుంచి ప్రారంభమైన కార్యక్రమాలు చండీయాగంతో ముగిశాయి. యజ్ఞానికి కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, గద్వాల్, వరంగల్, కర్నూల్ జిల్లాల నుంచి సుమారు 3 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు.
