నిధులు మంజూరు చేయాలని వినతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కొత్తపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కమిటీ సభ్యులు మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. అలాగే కొత్తపల్లి నుంచి అయోధ్యకు వెళ్లిన కరసేవకుడు పాతూరి బాల్‌రెడ్డిని సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పెద్దూరి పర్షాగౌడ్, బీనవేని శ్రావణ్‌యాదవ్, నవీన్ యాదవ్, మన్మోహన్‌రెడ్డి, అఖిలేశ్‌యాదవ్, పవన్‌గౌడ్, మహేశ్‌గౌడ్, కమిటీ సభ్యులు ●తదితరులు పాల్గొన్నారు.
23న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఎంపిక పోటీలు ఈ నెల 23న నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బ్రాడ్ జంప్, టెన్నిస్ బాల్ త్రో, లాంగ్ జంప్, జావెలిన్ త్రో స్టాండింగ్ షాట్‌పుట్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ చూపిన బాలబాలికలను జూన్ 1న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఆసక్తి గల వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు 12 ఏళ్ల లోపు పిల్లలను పోటీలకు పంపించాలని కోరారు.
వైద్య శిబిరం సందర్శన
వీర్నపల్లి(సిరిసిల్ల): కలెక్టర్ ఆదేశాలతో వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం శిబిరాన్ని సందర్శించారు. గ్రామంలో సర్వే వివరాలు, జ్వర బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అనంతరం వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో వెంట ఎల్లారెడ్డిపేట సీహెచ్‌సీ డాక్టర్ సరియా అంజూమ్ తదితరులు ఉన్నారు.
రాజన్నపేట ఇళ్ల విచారణ వాయిదా
బోయినపల్లి(చొప్పదండి): పరిహారం చెల్లింపులపై మంగళవారం వరదవెల్లి గ్రామపంచాయతీలో చేపట్టిన విచారణ వాయిదా పడినట్లు డీఎల్‌పీవో నరేశ్ తెలిపారు. మిడ్‌మానేరులో ముంపునకు గురైన వరదవెల్లి అనుబంధ రాజన్నపేటలో 9 ఇళ్లకు పరిహారం రావాలని కొందరు దరఖాస్తు చేసుకోగా, సుమారు రూ.1.80 కోట్లు పరిహారం పంపిణీకి అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. కాగా గతంలో తీసుకున్న ఇళ్లకే బై నంబర్లు వేసి పరిహారం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చెక్కుల పంపిణీ ఆగింది. ఈక్రమంలో కలెక్టర్ ఆదేశాలతో డీఎల్‌పీవో, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్‌కుమార్ విచారణకు వచ్చారు. గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు శేఖర్, భాగ్యలక్ష్మి, గంగాతిలక్, రాజశేఖర్, ప్రస్తుత ఎంపీవో శ్రీధర్, కార్యదర్శి శ్రీహిత తదితరులు హాజరయ్యారు. ఫిర్యాదుదారులు రాకపోవడంతో మరోసారి విచారణ చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా విచారణలో అధికారులు పలు రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. కొన్ని ముఖ్యమైన రికార్డులు లేవని తెలిసింది.
నిధులు మంజూరు చేయాలని వినతి


