ఇక.. పుర వేఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాల్లో ఎన్నికల నగరా మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు కార్యాచరణ చేపట్టింది. మంగళవారం నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి, జనవరి 1న పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 5న ఆయా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్‌ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది.


