ఫలితాలు సాధించినప్పుడే గుర్తింపు
కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినప్పుడే పాఠశాలకు, గ్రామానికి గుర్తింపు లభిస్తుందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు పేర్కొన్నారు. మండలంలోని కొలనూర్, ధర్మారం, కోనరావుపేట, నాగారం గ్రామాల్లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లు పంపిణీ చేసి మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. మండలంలో మొదటి విడతగా నాలుగు గ్రామాల్లో అందించామని, త్వరలోనే మిగతా గ్రామాల్లోని విద్యార్థులకు సైకిళ్లు అందుతాయని తెలిపారు. ఎంఈవో మురళీనాయక్, సర్పంచులు మిర్యాల్‌కార్ బాలాజీ, అజ్మీరా జయరాం, అప్పాల భూషణం, మాజీ జెడ్పీటీసీ అన్నపూర్ణ, నాయకులు సురేందర్‌రావు, తిరుపతి, సురేశ్, నాగరాజు పాల్గొన్నారు.


