రాచర్ల: మండలంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలంలోని గౌతవరం, అనుమలవీడు, రాచర్ల, అనుములపల్లె, సోమిదేవిపల్లె, పాలకవీడు, గంగంపల్లె, కాలువపల్లె, ఆకవీడు, చోళ్లవీడు, జేపీ చెరువు గ్రామాల్లో దాదాపు 400 హెక్టర్లలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షం పత్తి పంటకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదును వాన కురవడంతో వ్యవసాయ బోర్ల కింద సాగుచేసిన పత్తికి నీటి తడులు కట్టే బాధ తప్పిందని రైతులు తెలిపారు. వర్షం కారణంగా పొలాల్లో నీరు చేరడంతో చెరువులను తలపించాయి. అనుమలవీడులోని నక్కలవాగు, గౌతవరంలోని పితురువాగులు వర్షం నీటితో నిండుకుండలా దర్శనమిచ్చాయి. మార్కాపురం జిల్లాలోనే రాచర్ల మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలంలో 23 మిల్లీమీటర్లు, బేస్తవారిపేట 10.2, కొమరోలు 3.6, కంభం 3.2, గిద్దలూరు మండలంలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.


