వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి
దర్శి: తప్పులు మీరు చేసి ఆ తప్పులు పక్కదారి పట్టించేందుకు కేసులు మాత్రం మా నాయకులపై పెడుతున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం కేసులో కారుమూరి సునీల్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంగటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి సునీల్‌ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కారుమూరి సునీల్‌కుగానీ, ఆయన తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకు గానీ లిక్కర్ వ్యాపారంతో వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను తట్టుకోలేక వారిని ఈ లిక్కర్ స్కాం కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులెవరూ భయపడరని చెప్పారు. వాటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయన్నారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడంతో పాటు ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించిందన్నారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పూర్తిగా రద్దు చేశారన్నారు. అయినా మద్యం కేసు సృష్టించి పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేస్తున్నారన్నారు. కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారన్నారు. బార్లకు మేలు చేకూర్చేలా ప్రివిలేజ్ ఫీజును రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని గుర్తు చేశారు. ఎంపిక చేసిన డిస్టిలరీ నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారన్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ల చేతుల్లో ఉంచుకుని పర్మిట్ రూములు, వాడ వాడలా బెల్ట్ షాప్‌లు నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించి జనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదని, మద్యం సరఫరా విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైదన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ కేసును మాఫీ చేసుకోవడంతో పాటు జనం దృష్టిని మళ్లించడం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరాలో అక్రమాలు జరిగాయంటూ లేని కేసును సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్నారని మండి పడ్డారు. కార్యక్రమంలో కురిచేడు, ముండ్లమూరు మండలాల కన్వీనర్లు యన్నాబత్తుని సుబ్బయ్య, చింతా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చైతన్య రెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి యరమల మధు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం కురిచేడు మండల అధ్యక్షుడు శివారెడ్డి, యువజన విభాగం తాళ్లూరు మండల అధ్యక్షుడు విష్ణు చౌదరి, యువజన విభాగం దర్శి మండల అధ్యక్షుడు బాబు, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు మేడగం బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


