శతాబ్ది ఉత్సవాలు
అట్టహాసంగా
ఒంగోలు సిటీ:
ఒంగోలు విద్యా చరిత్రలో అతి అరుదైన ఘట్టంగా స్థానిక పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రముఖులంతా ఈ వేడుకలను జ్ఞాపకాల జాతరగా మలిచారు. పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో సంక్రాంతి సంబరాన్ని మించి నిర్వహించిన వేడుకలు అంబరాన్ని అంటాయి. విద్యా సంస్కృతులతో, భావోద్వేగాలతో ఆ ప్రాంగణమంతా కళకళలాడింది. శనివారం ఉదయం జ్యోతి ప్రజ్వలనతో శతాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. పీవీఆర్ స్కూల్ చరిత్రను ప్రతిబింబించే నృత్య రూపకం ఆకట్టుకుంది. చందు డ్యాన్స్ అకాడమీ ఒంగోలు వారి ప్రదర్శనలో పాఠశాల శతాబ్ది కాల ప్రయాణం కళాత్మకంగా ఆవిష్కృతమైంది. నళిని ప్రియా కూచిపూడి నృత్యానికేతన్ వారి గణపతి స్తోత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభను కమిటీ కార్యదర్శి ఆరిగ వీరప్రతాప్ సారథ్యంలో కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు అధ్యక్షతన ప్రారంభించారు. సుదీర్ఘకాలం హెడ్‌మాస్టర్‌గా పనిచేసిన కొప్పోలు హనుమంతరావు, ఇతర గురువులను ఘనంగా సత్కరించారు. హోదాలు, పదవులు పక్కనబెట్టి చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమం ఆద్యంతం అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది. సుమారు 2000 మంది పూర్వ విద్యార్థులు, అతిథులు పాల్గొనడంతో పీవీఆర్ స్కూల్ గ్రౌండ్స్ ఉత్సవ వేదికగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల పరిచయాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వారికి ఆత్మీయ సత్కారాలు వెరసి వేడుకలకు మరింత వన్నెతెచ్చాయి. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీబీ చైర్మన్ సీతారామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, నిర్వాహకులు దేనువుకొండ సుబ్బయ్య, బోడపాటి వెంకట సుబ్బారావు, మాంటిస్సోరి ప్రకాష్, పలువురు నాయకులు, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
పూర్వ విద్యార్థులు, ప్రముఖులతో
కళకళలాడిన ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్
గురువులను సన్మానించిన
పూర్వ విద్యార్థులు
శతాబ్ది ఉత్సవాలు


