బాబు నిర్బంధ పాలనను వ్యతిరేకించండి
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన నాయకుల మీద నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తున్న చంద్రబాబు పాలనను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. మల్లయ్య లింగం భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి రంగారావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడం చంద్రబాబు పాలన తీరుకు నిదర్శనమన్నారు. అప్పలరాజు మీద వున్న 19 కేసులు ప్రజా సమస్యల మీద పనిచేసిన కేసులే వున్నాయని తెలిపారు. వాటిలో కూడా 13 కేసులను కొట్టివేయడం జరిగిందని, నాలుగు కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. హోం శాఖ మంత్రి వంగలపూడి వనిత రైతులు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక చంద్రబాబు మెప్పు పొందేందుకే అప్పలరాజుపై కేసు బనాయించారని విమర్శించారు. రైతుల భూములను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించే క్రమంలో ప్రశ్నించే నాయకులను కేసులతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవుపలికారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జజ్జూరి జయంతి బాబు, ఏపీ రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, పి.కల్పన, శ్రీరాం శ్రీనివాసరావు, సుబ్బారావు, ఎంఎస్ సాయి పాల్గొన్నారు.


