అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
ఒంగోలు సబర్బన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రైవేట్ ట్రావెల్ బస్సు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. స్థానిక డీటీసీ కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులను దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అతివేగంతో ప్రమాదాలు జరుగుతాయన్నారు. అజాగ్రత్తగా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు చెప్పారు. ప్రతి బస్సులో అనుభవం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించాల్సిందిగా సూచించారు. సుదీర్ఘ దూర ప్రయాణాల కోసం తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లను ఉంచాలని, డ్రైవర్ విశ్రాంతి నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిందారు. ప్రతి బస్సులో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చడంతో పాటు, అత్యవసర ద్వారం విధిగా పరిశీలించాలన్నారు. ప్రయాణికులు అత్యవసర పరిస్థితులలో సహాయం పొందేందుకు ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ 9281607001 నంబర్‌ను బస్సులో స్పష్టంగా చదువుకోగలిగిన రీతిలో ప్రదర్శించాలని ఆదేశించారు. సంక్రాంతి సమయంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే సర్‌చార్జి అనుమతి ఉందని, అంతకు మించి వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లతో పాటు రవాణా శాఖ ఏఓ శ్రీనివాసులు, సుధాకర్, రవాణా శాఖ బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు రామచంద్రరావు, కిరణ్‌ప్రభాకర్, జగదీష్, ధర్మేంద్ర, సురేంద్ర ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులకు హెల్ప్‌లైన్ నంబర్ 9281607001 ఏర్పాటు
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో డీటీసీ సుశీల


