12న రాష్ట్ర స్థాయి కబడ్డీ సెలక్షన్స్
సింగరాయకొండ: ఆంధ్రప్రదేశ్ ఆధునిక కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఏఆర్‌సీఅండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో రాష్ట్రస్థాయి ఆధునిక కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తేళ్ల వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ మెమో, ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9502388413 నంబర్లను సంప్రదించాలని కోరారు.
సింగరాయకొండ: మండల కేంద్రంలోని చాకలిపాలేనికి చెందిన కుంభా యమ కిషోర్(31) నెల రోజులుగా కనిపించడం లేదని అతని తల్లి శివకుమారి శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 10వ తేదిన ఒంగోలు లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని, తిరిగి రాలేదని ఎక్కడ వెతికినా ప్రయోజనం లేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.
కొనకనమిట్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని గొట్లగట్టులో ఈ నెల 14 నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు, నాల్గవ బహుమతి రూ.3 వేలను అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న జట్లు ప్రవేశ రుసుం చెల్లించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9912312365, 8096476870 నంబర్లను సంప్రదించాలని కబడ్డీ పోటీల నిర్వాహకులు ఎన్.వెంకటేశ్వర్లు, గుమ్మా శ్రీనివాసులు కోరారు.
ఒంగోలు: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ నెల 13న జిల్లాస్థాయి సంప్రదాయ క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి జి.రాజరాజేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వం, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు తాడాట, తొక్కుడు బిళ్ల, కర్రసాము, తాడు లాగుడు పోటీలు ఉంటాయని, పురుషులకు కర్రసాము, ఏడు పెంకులాట, తాడులాగుడు, గాలిపటాలు పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9గంటలకు స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న క్రీడాకానులు పోటీల్లో పాల్గొనాలని కోరారు.
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖకు సంబంధించి ఈ నెల12న క్రికెట్ టీమ్ ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల క్రికెట్ గ్రౌండ్‌లో జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 2 నుంచి 7వ తేదీ వరకు నెల్లూరు, వెంకటగిరిలలో జరుగుతున్నాయని వెల్లడించారు. అందులో భాగంగా ప్రకాశం సర్కిల్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు జట్టు ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన ప్రకాశం విద్యుత్ సర్కిల్‌లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.


