మృత్యుంజయులు..!
మద్దిపాడు: లారీ డ్రైవర్ నిద్ర మత్తులో కారును ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ప్రమాదం నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం జాతీయ రహదారిపై మద్దిపాడు ఫ్లైఓవర్‌పై జరిగింది. వివరాల్లోకి వెళితే..ఒంగోలులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మూడో సంవత్సరం విద్యార్థులు సంక్రాంతి సెలవు రావడంతో స్నేహితులి కారు తీసుకొని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో మద్దిపాడు ఫ్లైఓవర్‌పై వెళుతుండగా హర్యానాకు చెందిన కంటైనర్ లారీ నిద్రమత్తులో కారు కుడివైపుబలంగా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లాడు. కారులోని విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు గమనించి లారీ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే లారీ డ్రైవర్ బ్రేకులు వేయడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు కారులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీయడంతో ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకొని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
కారును 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన లారీ
ప్రాణాలతో బయటపడిన యువకులు


