
స్మార్ట్ మీటర్లతో పెనుభారం
ఒంగోలు సబర్బన్: విద్యుత్ వినియోగదారులపై పెనుభారం మోపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రెండో రోజు ఒంగోలు నగరంలోని గాంధీజెగర్, జెడ్పీ కాలనీ, ఆర్టీసీ కాలనీ, శివప్రసాదు కాలనీ, కొత్తడొంక, మిలటరీ కాలనీ, యానాది సంఘం, వడ్డిగుంట కాలనీల్లో ఆదివారం ఐక్యవేదిక నాయకులు ఇంటింటికీ తిరిగి స్మార్ట్ మీటర్ల వల్ల భవిష్యత్‌లో జరిగే అనర్థాలను వివరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆదేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం కార్యక్రమంలో భాగంగా ఆదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్లు బిగింపు కోసం అనుమతి ఇచ్చారన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ ఇంటింటికీ తిరిగి నినాదాలు చేస్తున్నారు. గాంధీనగర్‌లోని స్మార్ట్ మీటర్లు గోడౌన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు రాంబాబు, ఏఐటీయూసీ నాయకుడు కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగలకొట్టండి వారిపై కేసులు పెట్టండి మేము మీకు మద్దతుగా ఉంటామని లోకేష్ చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే అవన్నీ మరిచిపోయారాఅని ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపకుంటే భవిష్యత్‌లో ప్రజలను కలుపుకొని పోరాటాలను చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు రాజశేఖర్, ఎం.ఎస్.సాయి, సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శి మహేష్, దామా శ్రీనివాసులు, సీహెచ్ చిరంజీవి, తంబి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికీ అవగాహన
గాంధీనగర్‌లోని స్మార్ట్ మీటర్ల గోడౌన్ వద్ద నిరసన