బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్  | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్

Published Fri, Mar 1 2024 4:24 PM

Zaheerabad Brs Mp Bb Patil To Join Bjp - Sakshi

సాక్షి, ఢిల్లీ:  లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీలోకి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్‌ బరిలోకి దిగనున్నారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

కాగా, ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)  భేటీ శుక్రవారం తెల్లవారుజామున  మూడు గంటల వరకు సాగింది.  

తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత,  మహబూబ్‌నగర్‌- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.   


 

Advertisement
Advertisement