‘పవన్‌, బాబు.. ఉచిత బస్సుకు నిధులేవీ?’ | YSRCP Satish Reddy Serious Comments On CBN Govt Over Free Bus Scheme, More Details Inside | Sakshi
Sakshi News home page

‘పవన్‌, బాబు.. ఉచిత బస్సుకు నిధులేవీ?’

Mar 1 2025 12:31 PM | Updated on Mar 1 2025 1:07 PM

YSRCP Satish Reddy Serious On CBN Govt

సాక్షి, వైఎస్సార్‌: ఏపీ బడ్జెట్‌ చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలకు కేటాయింపులకు పొంతన లేదన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. ఉచిత బస్సుకు నిధులేవీ? అని ప్రశ్నించారు.  చంద్రబాబుకు సంపద సృష్టించే సత్తా ఉంటే ఎందుకు వ్యాపారాలు తగ్గిపోతున్నాయి? అని వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. సూపర్‌ సిక్స్‌ అందించే ఉద్దేశ్యం ఉందా? లేదా?. నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి అయినా కేటాయించావా చంద్రబాబు?. స్త్రీ నిధి పేరుతో ప్రతీ మహిళకు నెలకు 1500 అన్నావు.. బడ్జెట్‌లో ఎక్కడ?. ఉచిత బస్సు ఎక్కడ?. తల్లికి వందనం 12వేల కోట్లు అవసరమైతే 9వేల కోట్లు ఇచ్చారు. దీపం పథకం 60 శాతం మందికి అందడం లేదు. మీరు గ్రామాలకు వచ్చి వాకబు చేసే ధైర్యం ఉందా?. అన్నదాత సుఖీభవకి కూడా అరకొర నిధులు కేటాయించావు. హామీలు నెరవేర్చకపోతే చొక్కా పట్టుకుని అడగమన్నాడు లోకేష్.. ఇప్పుడు ఏం చేయాలి?

అదేమంటే సంపద సృష్టిస్తాను అన్నావు.. ఆ సంపద సృష్టి ఎక్కడ?. ఇప్పటి వరకు లక్ష కోట్ల అప్పులు తెచ్చావు. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి?. గతంలో పెట్రోల్‌ రేట్లు పెరిగాయి.. అధిక పన్నులు వేస్తు​న్నారని అన్నావ్‌. మరి మీరేం తగ్గించారు?. అభివృద్ధి ఎక్కడ జరిగింది?. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లక్ష వరకూ డీబీటీ ఇచ్చాం. కడప ఉక్కు కోసం జిందాల్ సంస్టను తెచ్చాం.. ఈరోజు ఎందుకు ముందుకు పోవడం లేదు?. వైద్య విద్యలో మాకు సీట్లు కావాలని రాష్ట్రాలు పోటీ పడతాయి. వైఎస్‌ జగన్ తెచ్చిన సీట్లు వెనక్కు పంపిన ఘనత చంద్రబాబుదే.

మీపై మాట్లాడారని పోసానిని అరెస్ట్‌ చేశారు. లోకేష్‌, పవన్‌లు వైఎస్‌ జగన్‌ను ఎన్నెన్ని మాటలు అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టేందుకు నేను సిద్ధం. పోలీసులు మీ లిమిట్స్‌ దాటకండి. తప్పు చేస్తే ఇరు పక్షాల వారిపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు మాటలపై విశ్వసనీయత లేదని పవన్‌తో అబద్ధాలు చెప్పించాడు. పవన్‌.. ఇచ్చిన ప్రతీ హామీకి నువ్వే బాధ్యత తీసుకుని నెరవేర్చు. రెడ్‌బుక్‌లో మా హక్కులు కాలరాస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రం చంద్రబాబు, లోకేష్‌ జాగీరు ఏమీ కాదు. మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. సీజ్‌ ద షిప్‌ ఏమైంది?.. తిరుపతి లడ్డూ ఏమైంది?. అబద్దాలు చెప్పడం కాదు.. కొన్ని పనులు చేసైనా నిరూపించుకోండి’ అని హితవు పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement