రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరు: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan directions to party MPs | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరు: వైఎస్‌ జగన్‌

Published Fri, Mar 7 2025 3:43 AM | Last Updated on Fri, Mar 7 2025 7:06 AM

YSRCP President YS Jagan directions to party MPs

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పార్టీ ఎంపీలు

ఏపీ సమస్యలపై పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలి 

పార్టీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలపై సమావేశంలో చర్చ 

మిర్చికి మద్దతు ధర, వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్, కొత్త మెడికల్‌ 

కాలేజీల ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై దిశానిర్దేశం 

వీటన్నింటిపైనా ఎక్కడా రాజీ లేకుండా పోరాడాలని ఎంపీలకు వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం 

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచన  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని.. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10వతేదీ నుంచి పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరంలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తేనే రాష్ట్ర ప్రజలకు ఫలాలు పూర్తి స్థాయిలో అందించవచ్చని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

అలాంటి ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడమన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమన్నారు. కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా, మన  ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు  వ్యవహరిస్తున్నారని సమావేశంలో ఎంపీలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. 

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడటం లేదని.. టీడీపీ ఎంపీలతో కలసి ప్రధాని సహా సంబంధిత కేంద్ర మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని.. కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ సభ్యులు వెల్లడించారు. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంట్‌లో గట్టి పోరాటం చేయాలని.. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఎంపీలను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.  

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని, సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ ఎంపీలను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని.. దీనివల్ల ఉత్తరాదిలో లోక్‌సభ స్థానాలు పెరిగినట్లుగా దక్షిణాదిలో పెరగవని ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు ప్రస్తావించారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటులో ప్రస్తావించాలని సూచించారు. 

‘వన్‌ నేషన్‌... వన్‌ ఎలక్షన్‌’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఎంపీలు తెలిపారు. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలని ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించిన దేశాలు కూడా ఆ తర్వాత బ్యాలెట్‌ విధానానికి మళ్లిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. 
 


మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం.. 
నిరుపేదలకు వైద్య సదుపాయాలను చేరువలో అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ హయాంలోప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని మొదలు పెట్టగా.. వాటిలో పూర్తయిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించే దిశలో చంద్రబాబు సర్కారు చేస్తున్న యత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా.. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా చేరువలో అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టామని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. 

ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని.. కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ సదుద్దేశాలను నీరు గారుస్తున్నారని.. అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని, రాష్ట్రంలో మిర్చికి మద్దతు ధర అంశాన్ని కూడా చర్చకు తేవాలని  
ఎంపీలకు సూచించారు. 

వైఎస్‌ జగన్‌ భద్రతపై.. 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న జగన్‌కు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. 

వైఎస్‌ జగన్‌  గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన సమయంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్నారు. ప్రజా నాయకుడైన వైఎస్‌ జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించేందుకు ఇలాంటి దిగజారుడు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌లో గట్టిగా ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్‌సీపీపీ) నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తోపాటు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, మేడా రఘునాథరెడ్డి, పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement