
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.
చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
