
సాక్షి, తాడేపల్లి: మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై, వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడగలగాలి. మీరు పరిశీలకుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీ పనితీరు ఆధారంగా మీకు మంచి మంచి పదవులు వస్తాయి.. తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు.. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు చేయలేదు. మనం పాదయాత్ర చేసి, ప్రజలకు భరోసా ఇచ్చాం. 2019 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కొట్టిచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ప్రజావ్యతిరేకతను చీల్చడానికి చంద్రబాబు తన రాజకీయ భాగస్వామిని వేరేగా పోటీచేయించారు. అయినా చంద్రబాబు తన ఓటమిని అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు రాకముందు.. మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. ఇప్పుడు చంద్రబాబు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘అంతేకాదు తానిచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. రెండు రకాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయంగా ఉన్న రైతు భరోసా ఎగిరిపోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, అదే రూపాయికి వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. లూలుకు రూ.1500 కోట్ల భూములు కట్టబెట్టారు. మరొకరికి రూ.3వేల కోట్ల భూములు కట్టబెట్టారు.

..రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సెకీతో మనం రూ.2.49లకే విద్యుత్ కొనుగోలు చేశాం. కాని ఇవాళ వీళ్లు రూ.4.60లకు కొనుగోలు చేశారు. సెక్షన్ 108 ప్రకారం ఏపీఆర్సీపీమీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకున్నారు. అవినీతి మన కంటికి కనిపిస్తోంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, బెల్టుషాపులు, ఎమ్మార్పీ ధర కన్నా లిక్కర్ ఎక్కువకు అమ్ముకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు మట్టజెప్పనిదే ఏమీ కావడంలేదు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఒక్కసారి ఓటు వేశాక, ఐదేళ్లపాటు ప్రజలు వేచి చూడాలి. అందుకే ఇప్పుడేమీ చేయలేక ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు
..సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు. ఇప్పుడు కలియుగం పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని మన ప్రభుత్వంలో చాలా కష్టపడ్డాం. మన పరిపాలనలో చాలామంది నాయకులను కట్టడి చేశాం.
తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్‌సీపీకి 16, టీడీపికి 18 వచ్చాయి. కాని అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మన పార్టీ వైపునకు ఫలితాన్ని తిప్పుదామని యత్నించారు. ఆ రోజు మన పార్టీ ఎమ్మెల్యే అయిన పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశాం. ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయడంలేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. ఈ సారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్ ధైర్యంగా నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా నేను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేనివారినికూడా కక్షలకు గురిచేస్తున్నారు. వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం.
..బూత్ కమిటీలు పూర్తయ్చే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది ఉంటారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు, కనీస మద్దతు ధర అందడంలేదు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టేవాళ్లం. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జోక్యంచేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన్నాం. రైతులను ఆదుకున్నాం. అలాగే ఆయిల్‌పాం రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం.
..ధాన్యానానికి ఎంఎస్‌పీ ఇవ్వడమే కాదు, ఎంఎస్‌పీకి అదనంగా జీఎల్టీ కూడా ఇచ్చాం. వ్యవసాయరంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పంటలకు నష్టం వస్తే సీజన్ మగిసేలోగా వారికి ఇన్‌పుట్ సబ్పిడీ ఇచ్చేవాళ్లం. మళ్లీ సీజన్‌లోగా పరిహారిం ఇచ్చేవాళ్లం. క్రమంగా ప్పతకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఏమీ లేవు. క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించేవాళ్లం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.