
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మళ్లీ కోపమొచ్చింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో ఆయన మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం మంత్రులయ్యా మీరు అన్నరీతిలో చురకలంటించారాయన.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే.. మంత్రుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తున్న సమయంలో.. మంత్రులు ఏం పట్టనట్లు చూస్తూ ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యేల ప్రశ్నలను నమోదు చెయ్యని మంత్రులు, అధికారులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక్క మంత్రి కూడా నోట్ చేసుకోరా?. గతంలో ఉన్న సంప్రదాయం ఇప్పుడెందుకు లేదు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. జీరో అవర్ లో మాట్లాడిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇలా అసహనం.. ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్తేం కాదు. గతంలో కూటమి ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అసెంబ్లీకి తోలుకుని రావడంపై, అలాగే మంత్రులు ఆలస్యంగా రావడం.. క్వశ్చన్ అవర్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడంపైనా ఆయన మందలింపు వ్యాఖ్యలు చేశారు.
