
సాక్షి, అమరావతి: శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్సార్‌సీపీ సంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది. చివరకు తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్య సమాధానాలిచ్చారు. దీంతో.. నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.
మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ఏమీ పట్టవా?. మాకు కావాల్సింది రాజకీయ లబ్ధి కాదు.. ప్రజలకు మంచి జరగడం అని అన్నారాయన. ‘‘ప్రభుత్వం,మంత్రుల నుంచి బాధ్యతారాహిత్యంగా సమాధానం వస్తోంది. ప్రజల సమస్యలపై కనీసం బాధ్యత లేదు. నిస్సిగ్గుగా సమాధానాలు చెబుతున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ గురించి అడిగితే సమాధానం లేదు. ప్రజలకు మంచి జరిగేందుకు పోరాటం చేయడం మా బాధ్యత. కల్తీ మద్యం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మద్యం ఏరులైపారుతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం లేదు. తిరుపతి,సింహాచలం ఘటనలు ప్రభుత్వనిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే డొంకతిరుగుడు సమాధానం ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడాన్ని విమర్శిస్తున్నారు.
.. మేం ఎంతో హుందాగా ప్రశ్నలు అడిగాం. కానీ మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. తిరుపతి,సింహాచలం ఘటనలతో ప్రభుత్వం ,మంత్రికి సంబంధం లేదా?. ఈ ప్రభుత్వానికి.. ప్రజలు.. దేవుడు అంటే లెక్కలేదు. ఎంత సేపూ కుర్చీ కోసమే ఆరాటం. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను వాకౌట్ చేశాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే అంశాలనే మేం తీసుకుంటున్నాం. మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని రెండు రోజుల నుంచి పదిరోజులకు మార్చామని విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ వైఖరి ఏంటని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న మంత్రి రాజీనామా చేయాలి’’ అని బొత్స డిమాండ్ చేశారు. అంతకు ముందు మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతూ..
తిరుపతిలో జరిగింది ఘోరమైన ఘటనేనని, ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. టీటీడీ పాలకమడలి భక్తులకు ఎందుకు క్షమాపణలు చెప్పలేదని.. బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని వరుదు కళ్యాణి నిలదీశారు. భక్తుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? అని ప్రశ్నించారామె. ప్రభుత్వం, టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారామె.