
సా క్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివపప్రసాద్ రెడ్డి. 1978లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు ప్రారంభించారని, అప్పటి నుంచీ ఏ ఎన్నికలో కూడా వారి కుటుంబం ఓడిపోలేదని తెలిపారు. పులివెందుల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు సొంత ఇల్లులా చూసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరిగిందని తెలిపారు.
ఇప్పుడు జరిగేది 12 నెలల పదవి కలిగిన ఒక చిన్న మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక అని శివప్రసాద్ రెడ్డి ్కొన్నారు. గత జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక జరుగుతోందని అన్నారు. సాధారణంగా పదవిలో మరణిస్తే మళ్ళీ సానుభూతితో వాళ్ళకే వదిలేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ చిన్న ఎన్నిక కోసం టిడీపీ పోటీకి దిగిందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా టీడీపీ పోటీ చేయాలి కానీ పోలీసులను నమ్ముకుని వారు పోటీలో దిగుతున్నారని మండిపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ...‘ ఇక్కడ మీ బలం నామమాత్రమే అని మీకూ తెలుసు. ఈ మండలంలో 10,600 ఓట్లు ఉంటే గత 2024లో 3400 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయినా మీరు దంబికాలు పోతున్నారంటే మీరు ప్రజల్ని నమ్మి పోటీకి దిగలేదు. మేము ప్రజల్ని నమ్మి పోటీకి దిగాం. పులివెందుల ప్రజలు విశ్వాసానికి మారు పేరు. ప్రతిసారి వారు వైఎస్ కుటుంబ గౌరవాన్ని పెంచుతున్నారు. కానీ టీడీపీ డబ్బు, పోలీస్‌ను నమ్మి ఎన్నికల్లో దిగుతున్నారు.
ఇప్పుడు పులివెందులలో నాయకులను కొనడానికి వ్యాపారం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టీ నాయకులను కొనేందుకు లావాదేవీలు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ అక్రమ కేసులు, బైండోవర్‌ల పేరుతో పోలీస్‌లను వినియోగిస్తారు. స్పష్టంగా ఫ్రీ పోలింగ్ జరిగితే 4 వేలకు పైగా వైఎస్సార్‌సీపీకి మెజారిటీ వస్తుంది. వైఎస్ జగన్‌ను ఓడించాం అని జబ్బలు చరుచికోవడానికి తాపత్రయం పడుతున్నారుకానీ అది మీ వల్ల కాదు...ఈ పులివెందుల ప్రజలు చాలా తెలివైన వారు. ఈ ఎన్నిక పులివెందులకు, చంద్రబాబు నీచత్వానికి మధ్య పోటీ.
ఏదో విధంగా జగన్‌కు అవమానం చేయాలని చంద్రబాబు ఆడుతున్న నీచ క్రీడ ఇది. అయినా పులివెందులే గెలుస్తుంది. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. అప్పుడే రేషన్ డీలర్లపై వేదింపులు ప్రారంభం అయ్యాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల ఏర చూపుతున్నారు. నిజంగా మీది మంచి పాలన అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి. మీరు చేసింది శూన్యం కాబట్టి ధనం, పోలీసులను నమ్ముకుని పోటీకి దిగారు. మీరెన్ని చేసినా మేము శ్వాస వదిలే వరకు వైఎస్సార్‌సీపీ జెండా వీడేది లేదు’ అని పేర్కొన్నారు.